Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.
By - Knakam Karthik |
Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్
బ్రతికినంత కాలం పులిలా బ్రతకాలి అనే సామెతకు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఓ గ్రామంలోకి ప్రవేశించిన పులి ప్రజలను బెంబేలెత్తించడమే కాకుండా ఓ యువకుడిపై దాడి చేసి తీరిగ్గా ఓ ఇంటి బయట మంచంపై రెస్ట్ తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పాన్‌పథా బఫర్ జోన్ నుంచి వచ్చిన పులి మొదట పంట పొలాల్లో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే మధ్యాహ్నం సమయానికి అది గ్రామంలోకి చొరబడింది.
దీంతో గ్రామస్థులు ప్రాణభయంతో తమ ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామస్థులు కర్రలతో పులిని అడవిలోకి తోలే ప్రయత్నం చేయగా, అది ఒక్కసారిగా గోపాల్ కోల్ అనే యువకుడిపైకి దాడికి దిగింది. ఈ దాడిలో అతడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అతడిని మొదట బర్హీ ఆసుపత్రికి, అక్కడి నుంచి కట్నీకి తరలించారు.
యువకుడిపై దాడి చేసిన అనంతరం ఆ పులి దుర్గా ప్రసాద్ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఒక మంచంపై కూర్చుండిపోవడంతో గ్రామస్థులు వణికిపోయారు. సమాచారం అందుకున్న పాన్‌పథా బఫర్ జోన్ రెస్క్యూ టీమ్, వెటర్నరీ డాక్టర్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు 8 గంటల పాటు శ్రమించి పులికి మత్తుమందు ఇచ్చి బంధించి, సురక్షితంగా అడవిలోకి తరలించారు. దీంతో గ్రామంలో నెలకొన్న భయాందోళనలు తగ్గి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉండటంతో తమ గ్రామంలోకి తరచూ పులులు వస్తుంటాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోయారు.
Tiger strays into village near Madhya Pradesh's Bandhavgarh Reserve, attacks man pic.twitter.com/fWuqiFFWll
— NDTV (@ndtv) December 29, 2025