ఆ చీతాలకు పులితో ప్రమాదమా..?

భారతదేశంలో చీతాల జనాభాను పెంచే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లోకి చీతాలను..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2023 8:58 AM GMT
ఆ చీతాలకు పులితో ప్రమాదమా..?

భారతదేశంలో చీతాల జనాభాను పెంచే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లోకి చీతాలను వివిధ దేశాల నుండి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.!. చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కింద, ఐదు ఆడ, మూడు మగలతో ఎనిమిది నమీబియా చీతాలను గత సంవత్సరం సెప్టెంబర్ 17న KNP వద్ద ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు కేఎన్‌పీకి వచ్చాయి. తరువాత, పార్క్‌లో నాలుగు పిల్లలు పుట్టాయి, వాటి సంఖ్య 24 కి పెరిగింది. మార్చి నుండి, మూడు పిల్లలతో సహా తొమ్మిది చిరుతలు చనిపోగా.. ప్రస్తుతం 14 చిరుతలు, ఒక పిల్ల ఆరోగ్యంగా ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు రాజస్థాన్‌కు చెందిన ఓ పులి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లోకి ప్రవేశించింది. రెండు మూడు రోజుల క్రితం కెఎన్‌పి లోపల టైగర్ పగ్‌మార్క్‌లు కనుగొన్నామని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ నుండి కేఎన్‌పికి 100 కి.మీ దూరంలో ఉన్న రక్షిత అడవుల్లోకి దాదాపు మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లలో చిరుతలకు ఉంచడం వలన పులి వచ్చినా కూడా చీతాలకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేదని కెఎన్‌పి డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. చీతాలు పులులను చూసి సాధారణంగానే భయపడతాయని, చాలా జాగ్రత్తగా ఉంటాయని అధికారులు తెలిపారు. కునో నేషనల్ పార్క్ 748 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బఫర్ ఏరియా 487 చ.కి.మీ. మగ పులి సగటు బరువు 200 కిలోలు కాగా, మగ చిరుత 55 నుంచి 60 కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Next Story