మూడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. మ‌హారాష్ట్ర‌లో ఒక్క రోజే ఏడుగురికి .. 32కు పెరిగిన కేసులు

Three Year Old Child Among Seven New Cases In Maharashtra.ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 4:11 AM GMT
మూడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. మ‌హారాష్ట్ర‌లో ఒక్క రోజే ఏడుగురికి .. 32కు పెరిగిన కేసులు

ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ‌న‌దేశంలోనూ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తొలిసారి మ‌న‌దేశంలో మూడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థ‌రాణ అయింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే మ‌హారాష్ట్ర‌లో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. అందులో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32 కు చేరింద‌ని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ తెలిపింది. అందులో ముంబై నుంచి మూడు, పింప్రీ చించ్వాడాలో నాలుగు కేసులు ఉన్నాయి.

మూడున్నరేళ్ల చిన్నారితో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఏడుగురూ టాంజానియా, బ్రిటన్, సౌతాఫ్రికా, నైజీరియాల నుంచి వచ్చార‌ని తెలిపింది. ఏడుగురిలో న‌లుగురు ఇప్ప‌టికే రెండు డోసుల టీకాలు తీసుకున్న వారు న‌లుగురు ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. దేశ వ్యాప్తంగా న‌మోదైన 32 కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే 17 కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌రువాత రాజస్థాన్ 9. గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో 1 కేసులు న‌మోదు అయ్యాయి.

రెండో ద‌శ‌లో విజృంభించిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ దాదాపు ఆరు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ఇటీవ‌లే రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించింది. ఇక మాస్కులు ధ‌రించే విష‌యంలో చాలా మందిలో నిర్ల‌క్ష్యం క‌న‌బ‌డ‌తోంద‌ని కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. టీకాలు, మాస్కులు త‌ప్ప‌నిస‌రి అన్న విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాల‌ని నీతి అయోగ్ స‌భ్యుడు వి.కె.పాల్ తెలిపారు. మొత్తం క‌రోనా కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ శాతం 0.04శాతమేనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అగర్వాల్ తెలిపారు.

Next Story