జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు జవాన్లు అదృశ్యమయ్యారు. వారితో కాంటాక్ట్‌ను కోల్పోయినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. అదృశ్యమయిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు జవాన్లు ఉన్నారు. పూంచ్ - రాజౌరి ఫారెస్ట్ ఏరియాలో ఉగ్రవాదులకు, భారత్ ఆర్మీ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వీరమరణం పొందారు. నార్‌ఖాస్ ఫారెస్ట్‌లోని మెంధర్ సబ్ డివిజన్‌లో భారీగా ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది.
ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే జాడ లేని జవాన్ల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులకు, భారత ఆర్మీకి మధ్య కాల్పులు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇంత మంది జవాన్లు మరణించడం ఇదే మొదటిసారి. భద్రతా కారణాల రీత్యా పూంచ్-జమ్ము నేషనల్ హైవేని అధికారులు మూసివేశారు.