వెంటాడుతున్న కరోనా థర్డ్ వేవ్ భయం.. ఐసీఎంఆర్ కీలక ప్రకటన
Third wave unlikely to be as severe as second. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ భయం గుప్పిట ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. తమ చుట్టూ
By Medi Samrat Published on 26 Jun 2021 2:04 PM GMT
ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ భయం గుప్పిట ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. తమ చుట్టూ ఉన్న వాళ్లను కోల్పోయిన బాధల్లో ప్రజలు ఉండగా.. థర్డ్ వేవ్ భయం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా రాబోతోందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఇదే థర్డ్ వేవ్ కు కారణమవుతుందా అనే భయాలు కూడా ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. 'డెల్టా ప్లస్' రకం మరింత విజృంభించకముందే ఆంక్షల స్థాయిని పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ 'లెవెల్ 3' ఆంక్షలను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డెల్టా ప్లస్ వేరియంట్ నమోదైన తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ వేరియంట్ కారణంగా కరోనా ఉధృతి దేశంలో పెరుగుతుందని అనుకుంటూ ఉన్నారు.
అయితే ఐసీఎంఆర్ కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని.. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది. వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి చేసిన అధ్యయనంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేనని తేలింది.
కోవిడ్-19 బారీన పడి కోలుకున్న వారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ సరిపోతుందని, రెండో డోస్ అవసరం లేదని ఐసీఎంఆర్ చేసిన మరో అధ్యయనంలో తేలింది. ఈశాన్య రాష్ట్రాలు, దిబ్రూగఢ్‌లో పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 బారీన పడి ఇమ్యూనిటీ పొందిన వారికి సింగిల్ డోస్ కొవిషీల్డ్ సరిపడా భద్రత కల్పిస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ విషయమై వచ్చేవారం భారీ స్థాయిలో అధ్యయనాన్ని చేపట్టనున్నట్లు ఏఎంసీ పాథాలజీ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ గాయత్రి గొగోయ్ తెలిపారు. ఈ అధ్యయనంలో డాక్టర్ బిశ్వజ్యోతి బొర్కాకోటీతోపాటు పరిశోధకులు మందాకిని దాస్ సర్మాహ్, చంద్రకాంత్ భట్టాచార్య, నర్గీస్ బాలి తదితరులు పాల్గొన్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకుంటే దేశంలో వ్యాక్సిన్ల కొరత నివారణకు సహకరించిన వారవుతారని ఈ బృందం తెలిపింది. 18-75 ఏండ్ల లోపు స్త్రీ, పురుషులపై ఈ అధ్యయనం జరిగింది. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మాదిరిగా రెండో డోస్ తీసుకున్న వారిలో అత్యధికంగా యాంటీబాడీలు ఎదగలేదని.. రెండు డోస్‌లు తీసుకున్న వారితో పోలిస్తే, కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కోవిషీల్డ్ తొలి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఐజీఈ యాంటీబాడీ అత్యధికంగా డెవలప్ అయిందని ఈ అధ్యయన నివేదిక తెలిపింది.