థ‌ర్డ్‌ ఫ్రంట్‌తో ఎన్‌డీఏకి ఎలాంటి ముప్పు ఉండదు.. 2024 ఎన్నికల్లో 404 సీట్లు గెలుచుకుంటాం

Third front will not affect NDA. థ‌ర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటు ల‌క్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

By Medi Samrat  Published on  21 Feb 2022 8:36 AM GMT
థ‌ర్డ్‌ ఫ్రంట్‌తో ఎన్‌డీఏకి ఎలాంటి ముప్పు ఉండదు.. 2024 ఎన్నికల్లో 404 సీట్లు గెలుచుకుంటాం

థ‌ర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటు ల‌క్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌లను కలిశారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పందిస్తూ.. ఉద్ధవ్‌కి చెందిన శివసేన, కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేసినా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ)కి ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు.

మేము నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నామని.. ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. శివసేన, ఇతర పార్టీలు థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేసినా తమపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అథవాలే చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మేము గెలుస్తామ‌ని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ముంబైలో ఠాక్రే, పవార్‌లను కేసీఆర్ పిలిచిన తర్వాత రాందాస్‌ అథవాలే ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సమావేశం గురించి పూణేలో అథవాలే విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో సమావేశమై మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపినా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ) కి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. 2014లో బీజేపీ 282 సీట్లు, 2019లో 303 సీట్లు గెలుచుకున్నట్లే, 2024 ఎన్నికల్లోనూ 404 సీట్లు గెలుచుకుంటుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్‌ అథవాలే అన్నారు.


Next Story