తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. ప్రభుత్వ నిధులను ఎం కరుణానిధి విగ్రహం కోసం ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులను కరుణానిధి విగ్రహంపై ఎందుకు ఉపయోగించారు? అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తమిళనాడుకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మీ మాజీ నాయకుల గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు? దీనికి మేం అనుమతి ఇవ్వలేం" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మీ మాజీ నాయకులను కీర్తించడానికి ప్రభుత్వ నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యర్థనను ఉపసంహరించుకుని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రధాన రహదారిలో ఉన్న పబ్లిక్ ఆర్చ్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత నేత కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వును సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇటువంటి విగ్రహాల ఏర్పాటు వల్ల తరచుగా ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు అసౌకర్యం కలుగుతాయని హైకోర్టు పేర్కొంది.