సాధారణంగా ప్రజలు.. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే అధికారులు ముందస్తుగా నోటీసులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ దేవుడికి నోటీసులు ఇచ్చారు రైల్వే అధికారులు. వెంటనే గుడి ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ''హనుమాన్ జీ.. మీరు రైల్వే భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఈ స్థలాన్ని 10 రోజుల్లోగా ఖాళీ చేయకపోతే, మీపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
హనుమాన్ వెంటనే ఆలయాన్ని ఖాళీ చేసి.. ఆ భూమిని రైల్వే సెక్షన్ ఇంజనీర్‌కు అప్పగించాలని నోటీసులో కోరారు. నోటీసు చివరి లైన్‌లో.. ''ఇది చాలా అవసరం అని భావించండి'' అని పేర్కొన్నారు. బెరక్‌బందల్ ఖాటిక్ ప్రాంతంలో ఉన్న ఆలయ గోడపై ఈ నోటీసును అతికించారు. అయితే రైల్వే నోటీసును స్థానికులు వ్యతిరేకించారు. ఆలయం ఉన్న ఖాటిక్ ప్రాంతంలో నివసిస్తున్న పలు కుటుంబాలకు భూ ఆక్రమణలకు సంబంధించి రైల్వే నోటీసులు పంపింది.
ఈ క్రమంలోనే హనుమాన్ ఆలయానికి కూడా భూ ఆక్రమణ కింద నోటీసు పంపారు. 1921 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామని, పండ్లు, కూరగాయలు అమ్ముకోవడం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆక్రమణల కింద నోటీసులు అందుకున్న వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటోన్న ఇళ్లన్నీ ఖాళీ చేయాలని రైల్వే బృందం నోటీసులు అతికించింది. సోమ, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయ సమీపంలోకి చేరుకుని రైల్వేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.