అతడి మనసు నిండా మురికే ఉంది.. రణవీర్‌పై సుప్రీం ఆగ్రహం
సమయ్ రైనా షో ఇండియాస్ గాట్ లాటెంట్‌లో తల్లిదండ్రులపై యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాడియా అసభ్యకరమైన జోకులు వేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
By Medi Samrat
సమయ్ రైనా షో ఇండియాస్ గాట్ లాటెంట్‌లో తల్లిదండ్రులపై యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాడియా అసభ్యకరమైన జోకులు వేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ షోలో రణవీర్ అలహబాడియా చేసిన ప్రకటనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రణవీర్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు అతడిని మందలించింది. అతడి మనసు నిండా మురికి ఉందని కోర్టు పేర్కొంది. అలాంటి వ్యక్తి మాట ఎందుకు వినాలి.? అని ప్రశ్నించింది.
అతని (రణ్‌వీర్ అలహబాడియా) మనసు నిండా మురికి ఉందని సుప్రీం కోర్టు నిర్మొహమాటంగా చెప్పింది. అలాంటి వ్యక్తి మాట ఎందుకు వినాలి.? జనాదరణ పొందడం అంటే మీరు ఏదైనా వ్యాఖ్యానించడం కాదు. మీరు తల్లిదండ్రులను అవమానిస్తున్నారు. నీ తలలో ఏదో ఒంటి ఉన్నట్టుంది.. మీ వికృత మనస్తత్వంతో మొత్తం సమాజం ఇబ్బంది పడుతుందని అక్షింతలు వేసింది. కోర్టు అనుమతి తీసుకోకుండా దేశం బయటకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. రణ్‌వీర్‌ను తన పాస్‌పోర్ట్‌ను పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని కోర్టు పేర్కొంది.
అయితే, అతనిపై నమోదైన అనేక ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి అరెస్టు చేయకుండా కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. మహారాష్ట్ర, అస్సాం, జైపూర్‌లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై అరెస్ట్ చేయకుండా మధ్యంతర స్టే విధించాలన్న రణ్‌వీర్ పిటిషన్‌పై కోర్టు నోటీసు కూడా జారీ చేసింది. విచారణకు సహకరించాలని రణవీర్ అలహబాడియాను కోర్టు ఆదేశించింది. విచారణలో పాల్గొనకుండా ఏదైనా ముప్పు ఏర్పడితే మహారాష్ట్ర, అస్సాంలోని స్థానిక పోలీసులను ఆశ్రయించే స్వేచ్ఛ అతనికి ఉంటుందని కోర్టు పేర్కొంది.
స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా 'ఇండియాస్ గాట్ లాటెంట్' షోలో రణవీర్ అల్లాబాడియా గెస్ట్ న్యాయనిర్ణేతగా పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్‌లో అతడు తల్లిదండ్రుల లైంగిక జీవితంపై పోటీదారుని వివాదాస్పద ప్రశ్నలు అడిగాడు. రణ్‌వీర్ ఈ ప్రశ్న అడిగిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అయిన వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం, జైపూర్‌తోపాటు పలు ప్రాంతాలలో అలహబాడియాపై కేసులు నమోదయ్యాయి.