మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది.
By - Knakam Karthik |
మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది. బుధవారం తెల్లవారుజామున మొదలైన ఈ పరిస్థితి విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం క్యాటగిరీ-3 (CAT-III) పరిస్థితుల్లో పనిచేస్తుండగా, తక్కువ నుంచి దాదాపు శూన్య దృశ్యమానతలో ల్యాండింగ్‌లకు మాత్రమే అనుమతి ఉంది.
అయితే, ఉదయం గంటలకొద్దీ విమాన ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకునే అవకాశముందని ఎయిర్‌లైన్స్ హెచ్చరించాయి. భారత వాతావరణ శాఖ (IMD) దట్టమైన పొగమంచు కొనసాగుతుందన్న హెచ్చరికతో రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తోంది. నూతన సంవత్సర రోజున మేఘావృత వాతావరణంతో పాటు స్వల్ప వర్షం కురిసే అవకాశం ఉందని, కానీ తక్షణ ఉపశమనం మాత్రం కనిపించడం లేదని ఐఎండీ స్పష్టం చేసింది.
ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందు విమానాల స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించాయి. ఇండిగో సంస్థ ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా రాకపోకలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. రోడ్డు ప్రయాణానికి అదనపు సమయం కేటాయించాలని ప్రయాణికులకు సూచించింది. ఎయిర్ ఇండియా సంస్థ పొగమంచు కారణంగా వరుస ఆలస్యాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో పాటు, ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకుండా కొన్ని ఉదయపు విమానాలను ముందుగానే రద్దు చేసినట్లు వెల్లడించింది.
గాలి నాణ్యతలో ఎలాంటి ఊరట లేదు
పొగమంచుతో పాటు వాయు కాలుష్యం కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 383గా నమోదై ‘వెరీ పూర్’ స్థాయిలో ఉంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి ‘సివియర్’ స్థాయికి చేరింది. ఆనంద్ విహార్‌లో AQI 483గా నమోదు కాగా, ఐటీఓ, రోహిణి ప్రాంతాల్లో 426, చాంద్‌నీ చౌక్‌లో 419, ఆర్కే పురంలో 411గా ఉంది.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న నగరాల్లోనూ పరిస్థితి మెరుగ్గా లేదు. గురుగ్రామ్‌లో AQI 348, గాజియాబాద్‌లో 378, నోయిడాలో 391గా నమోదైంది. ఫరీదాబాద్‌లో 276గా ఉండగా, అక్కడ పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ ఇంకా ‘పూర్’ స్థాయిలోనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీల్లో కాలుష్య స్థాయి ‘సివియర్’కు చేరే అవకాశం ఉంది. జనవరి 2న స్వల్పంగా తగ్గి ‘వెరీ పూర్’ స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఆ తర్వాత కూడా కనీసం ఆరు రోజులపాటు గాలి నాణ్యత ‘వెరీ పూర్’గానే కొనసాగనుంది.
బలహీనమైన గాలులు, వాతావరణంలో సరైన గాలి ప్రసరణ లేకపోవడం వల్ల కాలుష్య కణాలు నేల సమీపంలోనే చిక్కుకుపోతున్నాయని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు వచ్చే 24 గంటల్లో సాధారణ స్థాయిలోనే ఉండగా, తర్వాతి రెండు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత మళ్లీ తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల మధ్య ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రజలు నూతన సంవత్సరాన్ని చలితో పాటు కాలుష్య మబ్బుల్లోనే జీవించాల్సిన పరిస్థితి నెలకొంది