'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి 'వై' కేటగిరీ సిఆర్‌పిఎఫ్ భద్రత కల్పించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) నిర్ణయించింది. మూలాల ప్రకారం.. ఇంటెలిజెన్స్, ఇతర భద్రతా సంస్థలు అగ్నిహోత్రికి భద్రతా ముప్పు అంచనా వేసిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 'వై' కేటగిరీ కింద.. అగ్నిహోత్రికి పోలీసు సిబ్బందితో పాటు ఒకరు లేదా ఇద్దరు కమాండోలు సహా ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు.
వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం కశ్మీరు లోయలో తీవ్రవాదం పెరుగుదల.. జమ్మూ మరియు కాశ్మీర్ నుండి కాశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై మోదీ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు వాస్తవాలను వెల్లడిస్తాయని.. దానిని అప్రతిష్టపాలు చేసేందుకు "కుట్ర" జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ వివిధ రంగాలకు చెందిన 117 మంది ప్రముఖులకు భద్రతను అందిస్తుంది. ఇదిలావుంటే.. మొదటిసారిగా 32 మంది మహిళా సిబ్బందిని వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లోకి చేర్చారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొత్తం 41 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. అయితే.. ఎన్నికల తర్వాత 27 మంది ప్రముఖులకు భద్రతను ఉపసంహరించుకున్నారు.