పటాకుల పొగతో వీరికి ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు..!

దీపావళి పండుగ ఆనందాన్ని పంచుతుంది. కానీ పటాకుల పొగ ఈ పండుగను విషపూరితం చేస్తుంది.

By Medi Samrat  Published on  30 Oct 2024 6:43 PM IST
పటాకుల పొగతో వీరికి ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు..!

దీపావళి పండుగ ఆనందాన్ని పంచుతుంది. కానీ పటాకుల పొగ ఈ పండుగను విషపూరితం చేస్తుంది. దీపావళి తర్వాత నగరాల్లో కమ్ముకునే పొగమంచు మన ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా ముప్పు కలిగిస్తుంది. ఈ కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు ఎక్కువగానే ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులు, కంటి చికాకు, చర్మ సమస్యలు పెరుగుతాయి. దీపావళి తర్వాత ప్రజలు ఏయే ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చో తెలుసుకుందాం.

పిల్లలకు..

పొగ పిల్లలకు విషం లాంటిది. వారి సున్నితమైన ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతున్న‌ సమయంలో పొగ పీల్చ‌డం చాలా హానికరం. అస‌లే చ‌లికాలం.. మంచు కురిసే కాలం.. ఆరుబయట ఆడుకునే అలవాటు వల్ల పిల్లలు ఎక్కువగా పొగమంచు బారిన పడే అవ‌కాశం ఉంది. దీని వ‌ల‌న‌ ఉబ్బసం, న్యుమోనియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా దారి తీస్తుంది.

బయట ప‌నిచేసేవారికి ప్ర‌మాదం..

దీపావళి వేళ‌ బయట పనిచేసే వారు వాయు కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు సులభంగా అనారోగ్యానికి గురవుతారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. కలుషితమైన గాలి వల్ల COPD వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. కంటి దుర‌ద‌, ఎరుపెక్క‌డం, పొడిబారడం వంటి సమస్యలు కూడా వ‌స్తాయి. దీపావళి తర్వాత కొంతమందికి గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు.

శ్వాసకోశ రోగులకు ఇబ్బందే..

ఆస్తమా లేదా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు పొగ వల్ల ఎక్కువగా ఇబ్బందిప‌డ‌తారు. వారు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. పొగ కారణంగా శ్వాసకోశ స‌మ‌స్య‌లున్న‌వారికి వ్యాధులు మరింత తీవ్రమవుతాయి. అధిక స‌మ‌స్య ఉన్న‌ వారు గుండెపోటు లేదా పక్షవాతానికి కూడా గురయ్యే అవ‌కాశం ఉంది. స్మోగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర‌మైన‌ ఇబ్బంది పడతారు.

వృద్ధుల‌కు స‌మ‌స్య‌లు..

వృద్ధుల బలహీనమైన రోగనిరోధక శక్తిని వాయు కాలుష్యం మరింత సున్నితంగా చేస్తుంది. కాలుష్యం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండెపోటు, ఇతర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. పొగమంచు ముక్కు, గొంతును చికాకుపెడుతుంది. దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఊపిరితిత్తుల వాపు వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది.

Disclaimer : వ్యాసంలో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.

Next Story