ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చిత‌క్కొట్టిన పిల్ల‌లు.. న‌వ వ‌ధువు ప‌రారు..!

The father of 7 children was going to do 5th marriage.న‌లుగురిని వివాహాం చేసుకున్నాడు. ఏడుగురు పిల్ల‌లు ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2022 8:37 AM IST
ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చిత‌క్కొట్టిన పిల్ల‌లు.. న‌వ వ‌ధువు ప‌రారు..!

న‌లుగురిని వివాహాం చేసుకున్నాడు. ఏడుగురు పిల్ల‌లు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అత‌డు తృప్తి చెంద‌లేదు. ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. మ‌రికొంత స‌మ‌యం గ‌డిస్తే.. ఐదో పెళ్లి కూడా పూర్తి అయ్యేది. స‌రిగ్గా వివాహానికి కొద్ది స‌మ‌యం ముందు అత‌డి రెండో భార్య‌, ఏడుగురు పిల్ల‌లు రంగంలోకి దిగి వివాహాన్ని అడ్డుకున్నారు. అంతేనా.. పెళ్లి కోసం రెడీ అయిన అత‌డిని చావ బాదారు. ఈ ఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డిన న‌వ వ‌ధువు చ‌డీచ‌ప్పుడు లేకుండా అక్క‌డి నుంచి జారుకుంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

మొహల్లా పటియాలో 55 ఏళ్ల ఓ వ్య‌క్తి నివ‌సిస్తున్నాడు. అత‌డు ఓ రోడ్డు కాంట్రాక్ట‌ర్‌. మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా ఏడుగురు పిల్ల‌ల‌కు తండ్రి అయ్యాడు. కాగా.. గ‌త ఆరు నెల‌లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవ‌ల ఆమెకు విడాకులు ఇచ్చాడు. ర‌హ‌స్యంగా మ‌రో రెండు వివాహాలు చేసుకున్నాడు. ఇంకా ఆశ చావ‌క‌పోవ‌డంతో ఐదో పెళ్లికి సిద్దం అయ్యాడు. పెళ్లికి మంగళవారం రాత్రి ముహూర్తం కుదిరింది. ఈ విష‌యం ఎలాగోలా రెండో భార్య‌, ఏడుగురు పిల్ల‌ల‌కు తెలిసింది.

వెంట‌నే వారు వివాహం జ‌రుగుతున్న ప్రాంతానికి బంధువుల‌తో చేరుకున్నారు. వ‌రుడిగా ముస్తాబైన అత‌డిని చూసి వారి ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతే.. అత‌డిపై దాడి చేశారు. తండ్రి అని కూడా చూడ‌కుండా పిల్ల‌లు అత‌డిని చావ‌బాదారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. విష‌యం తెలుసుకున్న న‌వ వ‌ధువు అక్క‌డి నుంచి మెల్లిగా జారుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. నిత్య‌పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు.

Next Story