లోన్‌ యాప్‌ల బరితెగింపు.. అడ్డుకట్ట వేసేలా కేంద్రం కీలక నిర్ణయం

The central government's key decision for the construction of loan apps. ఆన్‌లైన్‌ వేదికగా అప్పులు ఇచ్చే లోన్‌ యాప్‌లు దారుణాలకు తెగబడుతున్నాయి. అప్పు తీసుకున్న వారిని పలు రకాలుగా వేధింపులకు

By అంజి  Published on  9 Sept 2022 4:53 PM IST
లోన్‌ యాప్‌ల బరితెగింపు.. అడ్డుకట్ట వేసేలా కేంద్రం కీలక నిర్ణయం

ఆన్‌లైన్‌ వేదికగా అప్పులు ఇచ్చే లోన్‌ యాప్‌లు దారుణాలకు తెగబడుతున్నాయి. అప్పు తీసుకున్న వారిని పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తూ.. వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లకు చెక్‌ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధమైన లోన్‌ యాప్‌లు మాత్రమే గూగుల్‌, యాపిల్‌ స్టోర్స్‌లో ఉండేలా చూసేందుకు గైడ్‌లైన్స్‌ రూపొందించింది. అనైతిక రుణాలు, రికవరీ పద్ధతులను నిర్వహించే వాటిని తొలగించే ప్రయత్నంలో భారత ప్రభుత్వం డిజిటల్ లెండింగ్ యాప్‌లపై పరిశీలనను వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

చట్టబద్ధమైన డిజిటల్ లోన్‌ యాప్‌ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ కోరింది. అలాంటి యాప్‌లకు మాత్రమే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపింది. అక్రమ లోన్‌ యాప్స్‌ అసలు మొబైల్‌ ఫోన్లలో కనిపించకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా లోన్‌ యాప్‌ల ఆగడాలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. దీంతో రుణం తీసుకున్న చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ప్రస్తుతం లోన్​ యాప్​ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. రిజర్వు బ్యాంకు తయారు చేసే లిస్ట్‌లోని లోన్‌ యాప్‌లు మాత్రమే ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్స్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే అక్రమ లోన్‌ యాప్‌ల ఆగడాలకు ముకుతాడు వేసేలా అన్ని మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా పని చేయాలని తీర్మానం చేశారు. చట్టవిరుద్ధ లోన్‌ యాప్‌లపై ఈడీ, సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

''ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 1,110కు పైగా రుణ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 600 లోన్‌ యాప్‌లు ఎలాంటి లైసెన్స్‌ లేకుండానే అక్రమంగా బిజినెస్‌ చేస్తున్నాయి'' అని గతేడాది నవంబర్‌లో రిజర్వు బ్యాంకు చెప్పింది. ఇక తరహా యాప్‌లను ఎక్కువగా చైనా, సింగపూర్‌, ఇండోనేషియాలకు చెందిన వారు ఎక్కువగా నడిపిస్తున్నారు.

Next Story