12 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన వ్యాక్సిన్ తర్వరలో అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో కొవిడ్-19 మహమ్మారి నియంత్రించేందుకు ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ జైకోవ్ - డి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ కోటి డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిల్డ్రన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
జైకోవ్ - డి వ్యాక్సిన్ ఒక్క డోసుకు పన్నులు కాకుండా రూ.358 ఖర్చు అవుతోందని తెలిసింది. ఇక తమ దగ్గర ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల కూడా ఒక కోటి టీకా డోసులను మాత్రమే సరఫరా చేయగలమని జైడస్ క్యాడిలా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. మహమ్మారి కరోనా నియంత్రణ కోసం ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొదట డోస్ తర్వాత 28వ రోజు, ఆ తర్వాత 56వ రోజు మూడో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. సూది లేకుండా ప్రత్యేకమైన ఇంజక్టర్‌తో ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. భారత్‌లో 18 ఏళ్లు పై బడిన వారికి కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్లు వేయించున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.