'పీఎఫ్ఐ'పై ఐదేళ్లపాటు నిషేధం.. తక్షణమే అమల్లోకి..
The central government has imposed a five-year ban on PFI and its affiliates. ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
By అంజి
ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఓ పత్రికా ప్రకటన ప్రకారం.. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు తీవ్రవాదం, దానికి కావాల్సిన నిధులు సమకూర్చడం, ఉగ్రవాదంపై యువతకు శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని దేశ వ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో ఎన్‌ఐఏ నిర్దారించింది. పలు చోట్ల దాడులు నిర్వహించి.. పలువురు పీఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది.
ఈ క్రమంలోనే సంస్థ దుర్మార్గపు కార్యకలాపాలను అరికట్టడం అవసరమని గుర్తించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో), నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్), జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్), ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్), రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)పై నిషేధం విధించింది.
''అనేక క్రిమినల్, టెర్రర్ కేసులలో పీఎఫ్‌ఐ ప్రమేయం ఉంది. ఇది దేశం యొక్క రాజ్యాంగ అధికారం పట్ల పూర్తి అగౌరవాన్ని ప్రదర్శిస్తుంది. బయటి నుండి నిధులు, సైద్ధాంతిక మద్దతుతో ఇది దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా మారింది" అని కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ఉంది. గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో పిఎఫ్‌ఐకి అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, పిఎఫ్‌ఐకి చెందిన కొందరు కార్యకర్తలు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరి సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని కేంద్రం ఆరోపించింది.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత కేరళలోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్, కర్ణాటకలోని ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్ సంస్థలు కలిసి 2007లో పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించాయి. మైనార్టీలు, అణగారిన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడటం తమ లక్ష్యంగా పీఎఫ్‌ఐ ప్రకటించుకుంది. కర్ణాటకలో పీఎఫ్‌ఐపై 300కుపైగా కేసులు ఉన్నాయి. 2009లో పీఎఫ్‌ఐ అనుబంధంగా సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసింది.