మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారతదేశం సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాన్‌క్లేవ్‌లో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.."మేము ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన దేశంగా చాలా సంయమనంతో వ్యవహరించాము. సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడంలో మేము నమ్ముతాము. కానీ దీని అర్థం ఎవరైనా మా సహనాన్ని దుర్వినియోగం చేయవచ్చని కాదు. ఎవరైనా దానిని అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే, వారు నిన్నటి (ఆపరేషన్ సిందూర్‌ను సూచిస్తూ) వంటి 'నాణ్యమైన ప్రతిస్పందన'ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి."
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. హైక్వాలిటీ పరికరాలతో భారత బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో అమాయక ప్రజలకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి ప్రత్యేక అభినందనలు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పీవోకేలో ఉగ్రవాదులను వేటాడుతున్నాం. మరిన్ని దాడులకు భారత్ సిద్ధంగా ఉంది. పాక్ వక్రబుద్ధి మానుకోవాలి.. అని రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉందని ప్రజలకు హామీ ఇస్తున్నాం. మన దేశాన్ని రక్షించుకోకుండా ఏ పరిమితి మనల్ని ఆపదు. బాధ్యతాయుతమైన ప్రతిస్పందనకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. విస్తరిస్తున్న మన రక్షణ పారిశ్రామిక విశ్వం మనకు అపూర్వమైన బలాన్ని ఇస్తోంది..అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.