జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరి వేత లక్ష్యంగా భారత సైన్యం ముందుకు వెళుతోంది. జమ్మూ కశ్మీర్ లో 48 గంటల్లోనే వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది తీవ్రవాదులను కాల్చి చంపారు. రెండు రోజుల కిందట షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చగా.. తాజాగా షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు హతమయ్యారు. శనివారం రాత్రి ఒక ఉగ్రవాది హతమవ్వగా, ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దర్ని కాల్చి చంపాయి భద్రత బలగాలు.
హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం ఆపరేషన్ చేపట్టాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 10 గంటల పాటు భీకర కాల్పులు కొనసాగాయి. శనివారం రాత్రి ఓ ముష్కరుడు, ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దరు హతమయ్యారు. వీరిని అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బిహారా వద్ద శనివారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా కొందరు తీవ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. దీని గురించి వివరాలు తెలియాల్సి ఉంది.