తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనుమ రోజున స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు నుంచి వేలాది మంది భక్తులు తిరువణ్ణామలైకి తరలివచ్చారు. 14 కిలోమీటర్ల గిరివలయ మార్గం పూర్తి చేసి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజగోపురం వద్ద భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో వెయ్యి కాళ్ల మండపం సమీపంలో దర్శన వరుసలోకి ఇరుకు మార్గం ద్వారా ప్రవేశించేందుకు కొందరు భక్తులు ప్రయత్నించడంతో, అప్పటికే చాలాసేపు వేచి ఉన్న భక్తులతో వాగ్వాదం జరిగింది.
వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు భక్తులు పెన్సింగ్ దాటి స్వామి దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆలయ ప్రాంగణంలో ఘర్షణ జరిగింది. సంఘటన సమయంలో అక్కడ ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉండటంతో పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురాలేకపోయారు. భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో తగినంత పోలీస్ బలగాలను మోహరించి, వరుసలను క్రమబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తుంది. కనుమ రోజున అన్నామలైయార్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.