వ్యాక్సిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Telugu States CM Says Ready For Distribute Covid Vaccine. కరోనా వ్యాక్సిన్ పై ముఖ్యమంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ

By Medi Samrat  Published on  24 Nov 2020 11:35 AM GMT
వ్యాక్సిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

కరోనా వ్యాక్సిన్ పై ముఖ్యమంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ తయారీ, వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి, పంపిణీ సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీలో పాటించాల్సిన శీతలీకరణ పద్ధతులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి సారించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో వాటిని మారుమూల ప్రాంతాలకు తరలించడం అనేవి చాలా కీలకమైన విషయాలని దీనికి సమగ్రమైన ప్రణాళిక రచించాలని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేయాలని.. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణను సిద్ధం చేయాలని అన్నారు.

నరేంద్ర మోదీతో కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సి ఉందని.. ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. వ్యాక్సిన్ వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రానికి కొన్ని వ్యాక్సిన్ డోసులను పంపాలని వాటిని కొంత మందికి ఇవ్వాలని 10, 15 రోజులు పరిస్థితిని పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు కోల్డ్ చైన్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్లు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నవారికి ఇవ్వాలని అన్నారు.


Next Story