రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. మోదీ స్పందన ఇదే..!

Telangana's Ramappa temple gets Unesco's world heritage tag. తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా

By Medi Samrat  Published on  25 July 2021 6:35 PM IST
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. మోదీ స్పందన ఇదే..!

తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి నేడు యునెస్కో గుర్తింపు వచ్చింది. ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు యునెస్కో బృందం తెలిపింది. దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను వివరించింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్‌లలో పరిగణలోకి తీసుకునేలా రష్యా చేసింది.

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించడం పట్ల భారతప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "అద్భుతమైన విషయం! అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ గొప్ప ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలని నేను మీ అందరిని కోరుతున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గొప్ప విషయం అంటూ ట్వీట్ చేశారు. రామప్ప ఆలయానికి ఈ గుర్తింపు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని.. తర్వాతి టార్గెట్ హైదరాబాద్ నగరం అని ఆయన అన్నారు. హైదరాబాద్ కు వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తీసుకుని రావడానికి ప్రయత్నిద్దామని ఆయన అన్నారు.

తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు.. రామప్ప దేవాలయానికి దక్కిన గుర్తింపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాచకొండ పోలీసు విభాగం కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది.



Next Story