ఒక రోజు ఆర్టీసీ బస్సు సమయానికి రాకపోతే సరి. ఇదే సమస్య రోజు ఎదురైతే ఇబ్బందులు పడక తప్పదు. ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోతే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు, వివిధ పనుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతారు. బస్సులు సమయానికి రాకపోతే డిపోలో లేదా బస్ స్టాండ్‌లోని అధికారులకు ఫిర్యాదు చేస్తుంటాం. ఆ తర్వాత అధికారులు స్పందిస్తే సమయానికి బస్సులు వస్తాయి లేదంటే.. మళ్లీ అదే పరిస్థితి ఉంటుంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని.. ఆర్టీసీ బస్సులు నడపడం లేదంటూ ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. 8వ తరగతి చదువుతున్న వైష్ణవి అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సులను పునరుద్ధరించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసిన జస్టిస్ ఎన్వీ రణమకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.