సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, కరోనాను నిర్మూలించాలి...అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడ నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ‘అత్యంత దుర్మారం-అజ్ఞానం’తో కూడినవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి సనాతన ధర్మం గురించి తెలియదని అన్నారు. ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడితే హిందువులపై ఎందుకు వివక్ష చూపుతున్నాడని తమిళిసై ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ తండ్రి సీఎం ఎంకే స్టాలిన్ హిందువుల పండగలకు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పరని.. దీపావళి, కృష్ణజయంతి, వినాయక చతుర్థి వంటి పండగలకు ఆయన శుభాకాంక్షలు చెప్పరన్నారు. తనను తాను గొప్ప క్రైస్తవుడిగా పేర్కొంటున్న ఆయన ఎందుకు ఇంకో మతాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారని, ఉదయనిధి ప్రజలకు క్షమాపణ చెప్పాలని తమిళిసై డిమాండ్ చేశారు.