ఏసీబీ అధికారుల దాడి భయంతో.. రూ. 20 లక్షలు కాల్చేసిన తహసీల్దార్
Tehsildar burns RS 20 lakh as ACB visits over bribery allegations. ఓ తహాసీల్దార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. భయంతో 20లక్షల రూపాయాలను కాల్చివేశారు.
By తోట వంశీ కుమార్ Published on 26 March 2021 5:20 AM GMTలంచం తీసుకోవడం నేరం. లంచం తీసుకుంటే ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారులకు పట్టుబడతాం అని తెలిసీ కూడా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఓ తహాసీల్దార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న సదరు తహసీల్దార్ వెంటనే ఇంట్లోని కిటికీలు, తలుపులు అన్ని మూసివేశాడు. వెంటనే గ్యాస్ స్టవ్ వెలిగించి నోట్ల కట్టలను మంటల్లో కాల్చివేశాడు. అక్కడకు చేరుకున్న అధికారులు ఎలాగోలా ఇంట్లోకి వెళ్లి అతడిని ఆపారు. అప్పటికే సదరు తహసీల్దార్ ఏకంగా 20లక్షల రూపాయాలను కాల్చివేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. సిరోహి జిల్లాలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్ ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పర్వత్‌ను ప్రశ్నించగా.. ఇందులో తన తప్పులేదని.. తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకే తాను ఈ పని చేస్తున్నట్లు అతడు చెప్పారు. వెంటనే అధికారులు అతడిని తీసుకుని తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఇంటికి వెళ్లారు. అయితే.. అధికారులు తన ఇంటికే వస్తున్నారన్న సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంటనే ఇంటి తలుపులు, కిటీకీలు మూసివేశాడు. వంటగదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి నోట్ల కట్టలను కాల్చడం ప్రారంభించాడు.
ఈలోపు ఏసీబీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇంటిలోపలి నుంచి నోట్లు కాలుస్తున్న వాసన రావడాన్ని గుర్తించిన అధికారులు డబ్బులను కాల్చొద్దని అతడిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి కల్పేశ్ వారి మాటలను వినకుండా అలాగే కాలుస్తున్నాడు. ఈలోపు ఎలాగోలా అధికారులు ఇంటి లోపలికి వెళ్లి అతడిని ఆపారు. అప్పటికే అతడు రూ.20లక్షలను కాల్చివేశాడు. చివరికి రూ.1.5లక్షలను అతడి నుంచి స్వాదీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నోట్లు కాల్చడానికి తహసీల్దార్‌కు అతడి భార్య సహకరించడం విశేషం.