ఇక 'తందూరీ రోటీ' దొరకదు.. ఎందుకంటే..?
దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది.
By - Medi Samrat |
దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని అన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, పలు ఆహార దుకాణాలలో బొగ్గు, కలపతో కాల్చిన తందూరీ రోటీలను పూర్తిగా నిషేధించింది. 1981 వాయు చట్టంలోని సెక్షన్ 31( A) కింద ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు డీపీసీసీ తెలిపింది. ఇకపై కచ్చితంగా అన్ని వాణిజ్య కిచెన్‌లను గ్యాస్, విద్యుత్ లేదా ఇతర ఇంధనాలకు మార్చాలని సూచించింది.
వాయు కాలుష్య స్థాయిలు దిగజారుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం బొగ్గు, వంటచెరుకు తందూర్ల వాడకంపై పూర్తి నిషేధం విధించింది. హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, వీధి పక్కన ఉన్న ఆహార జాయింట్లలో చెత్తతో సహా ఏ రూపంలోనైనా బహిరంగ దహనం చేయడాన్ని నిషేధించింది. బొగ్గు, కలపతో వంట చేయడం ద్వారా ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో మరింత కాలుష్యానికి కారణం అవుతుందని తెలిపింది. ఇది గాలి నాణ్యత సూచికలో నిరంతర క్షీణతకు దారితీస్తున్న కారణంగా ఈ ఉత్తర్వును కఠినంగా అమలు చేయాలని, నగరం అంతటా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది.