ఘోర ప్రమాదం: 3 ట్రక్కులు, 2 కార్లు ఢీ.. నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  25 Jan 2024 3:51 PM IST
tamilnadu, accident, cctv, four dead, 8 injured,

ఘోర ప్రమాదం: 3 ట్రక్కులు, 2 కార్లు ఢీ.. నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్‌ ఘాట్‌ రోడ్డు వద్ద ఒక వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఏకంగా మూడు ట్రక్కులు, రెండు కార్లు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘోర సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా.. వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఈ వీడియో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. వీడియో ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు ముందు వెళ్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. దాంతో.. ఆ ట్రక్కు ఇంకాస్త ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధ్యలో మరో కారు చిక్కుకుపోయింది. ఒక ట్రక్కు వంతెనపై నుంచి కిందపోడిపోయింది. ఇక వెనకాలే వస్తున్న మరో కారు ట్రక్కులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయాలపాలైన మరో 8 మందికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఇదే ప్రమాదంపై స్పందించిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్.. పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న భయంతోనే తాము తొప్పూర్ ఘాట్ సెక్షన్ వద్ద మంజూరైన ఎలివేటెడ్ హైవేని సత్వరమే అమలు చేయాలని పట్టుబడుతున్నామని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ అన్నారు.

Next Story