తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల క్యాంపస్‌లోని విద్యార్థినులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. పాలక్కోడులో ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు గిరిజన సంఘాలకు చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, నీరు తీసుకురావడం, పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం వంటి క్లీనింగ్ పనులు అప్పగించడం వల్ల తమ పిల్లలు తరచూ అలసిపోయి ఇంటికి తిరిగి వస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థినులు చీపుర్లు పట్టుకుని స్కూల్‌లోని టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమ పిల్లల చదువులు, బాగోగులు దెబ్బతింటున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మా పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నది చదువుకోడానికి.. శుభ్రం చేయడానికి కాదు'' అని ఓ విద్యార్థిని తల్లి విజయ ఆవేదన వ్యక్తం చేశారు.
''ఇంటికి రాగానే హోం వర్క్ చేయలేక చాలా అలసిపోతారు.. ఎందుకని అడిగితే చదువుకోకుండా స్కూల్, టాయిలెట్స్ శుభ్రం చేసే పనిలో పడ్డారని చెప్పారు.. ఇది వింటేనే గుండె తరుక్కుపోతోంది'' అని ఆమె చెప్పారు. వీడియో వైరల్, తల్లిదండ్రుల పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా, జిల్లా విద్యాశాఖ అధికారి వేగంగా చర్యలు తీసుకున్నారు. విచారణ పెండింగ్‌లో పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థుల హక్కులకు, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.