తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు అనేక చర్యలు చేపట్టింది. తాజాగా ఆరోగ్య మంత్రి ఎమ్.ఏ సుబ్రమణియన్ జనవరి 11, మంగళవారం కోవిడ్ -19, రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితిపై వ్యాఖ్యానించారు. పూర్తి లాక్‌డౌన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకూడదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారని ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి పరిమితం చేయబడిన లాక్‌డౌన్ సరిపోతుందని మా సుబ్రమణియన్ అన్నారు.
పెరుగుతున్న కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కోవిడ్ -19 నియంత్రణలను జనవరి 31 వరకు పొడిగించింది. జనవరి 6 నుంచి విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. తమిళనాడులో సోమవారం 13,990 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 62,767కి పెరిగాయి. పొంగల్ పండుగ కారణంగా దేవాలయాలలో పెద్దఎత్తున గుమికూడతారనే భయంతో జనవరి 14-18 వరకు మతపరమైన ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే, ప్రజలు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వం 75 శాతం ఆక్యుపెన్సీతో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించింది.