రాజ్ భవన్ నుంచి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. గవర్నర్‌పై విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం
తమిళనాడులో మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవిపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
By Medi Samrat
తమిళనాడులో మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవిపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్ రవి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని స్టాలిన్ అన్నారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. బీజేపీ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి ద్రవిడ మోడల్‌ను, డీఎంకేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పట్ల వివక్ష చూపుతోందని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు, డ్రగ్స్, మహిళలపై నేరాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు.
గవర్నర్ రవి ప్రసంగంపై స్టాలిన్ స్పందిస్తూ.. భారత్‌లో ద్రవిడ మోడల్‌ను ఎదగనివ్వకూడదని కొందరు విషపురుగులు కోరుతున్నారని, అందులో (బీజేపీ) ఒకరు నీచమైన రాజకీయాలకు దిగారని, అది కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి అని అన్నారు. ఆయన (గవర్నర్ రవి) రాజ్ భవన్ నుంచి డీఎంకేపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారు ద్రవిడను ఎగతాళి చేస్తున్నారు.. బిల్లును ఆమోదించడానికి నిరాకరించారు. తమిళ గీతాన్ని అవమానించారు.. శాంతిభద్రతలతో సహా మహిళల భద్రత.. విద్యపై భయాందోళనలు ప్రచారం చేస్తున్నారు.
ఆర్‌ఎన్ రవి ప్రకటన అబద్ధమని పేర్కొంటూ.. సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ డేటాను సమర్పించారు. దాని ప్రకారం.. మెరుగైన పాఠశాల విద్యలో తమిళనాడు భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయని, దీని వల్ల రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మహిళలకు భద్రత లేదని గవర్నర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని స్టాలిన్ అన్నారు.