తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అతి దారుణంగా చంపేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని చెన్నై నగర పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను శుక్రవారం నేరం జరిగిన మూడు గంటల్లోనే పట్టుకున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ చెప్పారు. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్), అస్రా గార్గ్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని వివరించారు. హత్యలో ప్రమేయం ఉన్న వారి కోసం వెతుకుతున్నామని చెప్పారు.
హత్య వెనుక గల కారణాల గురించి అడిగితే ప్రత్యేక బృందం దీనిపై విచారణ చేస్తోందన్నారు. రాజకీయ కోణం అస్సలు లేదని ఆయన అన్నారు.
అరెస్టయిన వారిలో చాలా మందిపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించవచ్చని.. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని అధికారి తెలిపారు.
బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురికావడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్మ్ స్ట్రాంగ్ ను ఆటవిక రీతిలో, దారుణంగా నరికి చంపడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ఈ విషాద సమయంలో ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబానికి, స్నేహితులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు.