పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు తమిళనాడులో నిషేధించారు. ఈ రకమైన మయోనైస్‌ను ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారంగా పరిగణిస్తున్నందున, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.
తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో మయోనైస్‌ను గుడ్డు పచ్చసొన, కూరగాయల నూనె, వెనిగర్ లతో తయారు చేస్తారని, పలు ఫుడ్స్ కోసం వీటిని ఉపయోగిస్తారని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం తన ప్రకటనలో, ఆహార వ్యాపార నిర్వాహకులు సరైన పద్ధతుల్లో తయారీ చేయకుండా, నిల్వ చేయడం కారణంగా సాల్మొనెల్లా టైఫిమురియం, సాల్మొనెల్లా ఎంటెరిటిడిస్, ఎస్చెరిచియా కోలి, లిస్టెరియా మోనోసైటోజీన్స్ ద్వారా కలుషితం అవుతాయని, తిన్నవారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. కలుషితమైన ఆహార పదార్థాలలో ఉండే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు విరేచనాలు, వాంతులు, జ్వరానికి కారణమవుతాయని నిపుణులు తెలిపారు.