డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం త్వరలో భారతదేశంలో చట్టబద్ధం కానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అయితే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని లోక్‌సభలో గడ్కరీ తెలిపారు. అతని ప్రకటన ప్రకారం.. ఫోన్ హ్యాండ్స్-ఫ్రీ పరికరానికి కనెక్ట్ చేయబడితే మాత్రమే ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతి ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా కారులో కాకుండా జేబులో పెట్టుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపి, చలాన్ కట్ చేస్తే, దానిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
కేంద్ర మంత్రి మాటల్లో చెప్పాలంటే, "డ్రైవర్ హ్యాండ్స్-ఫ్రీ పరికరాన్ని (బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్) ఉపయోగిస్తుంటే, ఫోన్‌లో మాట్లాడినట్లయితే, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడదు. అటువంటి పరిస్థితిలో, ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జరిమానా విధించలేరు. అతను జరిమానా విధిస్తే, ఎవరైనా దానిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు" అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనికి ముందు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, సెప్టెంబర్‌లో వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను రూట్ నావిగేషన్ కోసం మాత్రమే ఉపయోగించవచ్చని, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఏకాగ్రతకు ఆటంకం కలిగించదని తెలిపింది.