ప్రణయ్‌రాయ్ సారధ్యంలోని టీవీ చానెల్ గ్రూప్ `న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ – NDTV) ను భారత సంపన్నుడు గౌతం అదానీ టేకోవర్ చేశారు. ఈ టేకోవర్ ఒక బాధ్యత అని ఇండియన్ బిలియనీర్ గౌతం అదానీ చెప్పుకొచ్చారు. ఎన్డీటీవీ టేకోవర్‌ను బిజినెస్ అవకాశం కంటే ఒక బాధ్యతగానే చూస్తున్నామన్నారు. ఇండిపెండెంట్ మీడియా సంస్థగా ఉన్న ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఆగస్టు నెలాఖరులో తన ప్రణాళికలను గౌతం అదానీ బయట పెట్టారు.
1988లో భార్యాభర్తలు ప్రణయ్ రాయ్, రాధికారాయ్‌లతో కూడిన టీం ఎన్డీటీవీ ఏర్పాటైంది. అదానీ గ్రూప్ ఎన్డీటీవీ ప్రమోటర్ల సమ్మతి లేకుండా, సంప్రదింపులు లేకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ గ్రూప్ సంస్థను టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఎన్డీటీవీ గతంలో ఆరోపించింది. ఇండిపెండెన్స్ అంటే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే.. మీరు అది తప్పు అని చెప్పొచ్చు. ప్రభుత్వం ప్రతి రోజూ చేసే మంచి పని గురించి చెప్పడానికి కూడా మీకు ధైర్యం ఉండాలని గౌతం అదానీ అన్నారు. తమ సంస్థ టేకోవర్ చేసిన తర్వాత కూడా ఎన్డీటీవీ చైర్మన్‌గా కొనసాగొచ్చునని ప్రణయ్‌రాయ్‌ను ఆహ్వానిస్తున్నానని గౌతం అదానీ తెలిపారు.