సుశీల్ కుమార్‌ మోడీ క‌న్నుమూత‌.. ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియ‌ర్ నాయకుడు సుశీల్ మోదీ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.

By Medi Samrat  Published on  14 May 2024 7:51 AM IST
సుశీల్ కుమార్‌ మోడీ క‌న్నుమూత‌.. ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియ‌ర్ నాయకుడు సుశీల్ మోదీ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. భౌతికకాయం మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో పాట్నాలోని రాజేంద్ర నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటుంది. సుశీల్ మోదీ గత నెలలోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. రిటైర్మెంట్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నేను ఏమీ చేయలేనని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పానని వెల్ల‌డించారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న సుశీల్‌కుమార్‌ మోదీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 72 ఏళ్ల సుశీల్‌కుమార్‌ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ కారణంగా ఆయ‌న‌ లోక్‌సభ ఎన్నికలలో కూడా పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఏప్రిల్ 3న తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. సుశీల్ మోదీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం ద్వారా.. 'నేను గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దాని గురించి ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో నేనేమీ చేయలేను. ఇదంతా ప్రధాని మోదీకి చెప్పాను. అంద‌రికీ కృతజ్ఞతలు.. ఎల్లప్పుడూ దేశం, బీహార్, పార్టీకి అంకితం అంటూ పోస్టు చేశారు.

సుశీల్ మోదీ మృతికి సంతాపం తెలుపుతూ.. దశాబ్దాలుగా పార్టీలో నా మిత్రుడు, విలువైన సహచరుడు సుశీల్ మోదీ జీ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. బీహార్‌లో బిజెపి ఎదుగుదల, విజయాల వెనుక ఆయ‌న‌ అమూల్యమైన సహకారం ఉంది. ఎమర్జెన్సీని ఎదిరించి విద్యార్థి రాజకీయాలతో గుర్తింపు తెచ్చుకుని స్నేహశీలిగా, కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అంటూ సంతాపం తెలియ‌జేశారు.

Next Story