దీనిని అంతులేని కథగా మార్చకండి.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.!
Supremecourt starts hearing lakhimpur kheri violence. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
By అంజి Published on 20 Oct 2021 3:20 PM ISTఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఘటనకు సంబంధించి చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతులేని కథగా ఈ కేసు విచారణను మార్చకండంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. తెల్లవారుజామున ఒంటిగంట వరకూ నివేదిక కోసం చూశాం, చివరి నిమిషంలో నివేదిక సమర్పిస్తే.. తామెప్పుడు దాన్ని పరిశీలించాలంటూ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. లఖీంపూర్ ఘటనలో ఎక్కువ మంది సాక్షుల్ని ఎందుకు విచారించలేదని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 164 మంది సాక్షుల్లో ఇప్పటి వరకు 44 మంది విచారించామని ప్రభుత్వం కోర్టుకు తెలుపగా.. ఇంతకంటే ఎక్కువ మందిని ఎందుకు విచారించలేకపోయారని కోర్టు ప్రశ్నించింది.
సాక్షులను పోలీసులు ప్రశ్నిస్తే తప్ప స్పష్టత రాదని, వారి వాంగ్మూలాలను రికార్డు చేయాలంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము సంతృప్తిగా లేమని, ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహారిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఘటనకు సంబంధించిన కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నామని హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. అలాగే సాక్షుల్ని విచారించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు. లఖీంపూర్ ఘటన కేసు ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసన తెలుపుతుండగా బీజేపీ కాన్వాయ్ ఒక్కసారిగా రైతులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది చనిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అక్టోబర్ 11న అదుపులోకి తీసుకున్నారు.