ఆ నియామకాలు చెల్లవు..బెంగాల్ సర్కార్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది.
By Knakam Karthik
ఆ నియామకాలు చెల్లవు..బెంగాల్ సర్కార్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీచర్ల నియామకాల రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు సమర్థించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై దర్యాప్తు చేపట్టింది. గురువారం దీనిపై కీలక తీర్పును వెలువరిస్తూ.. టీచర్ల నియామకాలకు సంబంధించిన విషయాలను పరిశీలించిన అనంతరం, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ ఇదివరకు కలకత్తా హైకోర్టు తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. కలకత్తా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.
2016లో చేపట్టిన 25వేల టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల నియమాక ప్రక్రియ చట్టవిరుద్దంగా ఉందని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మూడు నెలల్లో కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త నియామక ప్రక్రియలో ఉత్తీర్ణలైనవారు 2016లోని నియామకం అయినప్పటినుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణులు కాకపోతే జీతం తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పోస్టింగ్ లో ఉన్న దివ్యాంగులకు కోర్టు సడలింపు ఇచ్చింది. వారిని ఉద్యోగంలో కొనసాగించాలని పేర్కొంది.