ముంబై హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే... వివాదస్పదంగా మారిన తీర్పు
Supreme Court stays Bombay HC's skin-to-skin order under Pocso Act. 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ముంబాయి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే.
By Medi Samrat Published on 27 Jan 2021 6:02 PM IST12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ముంబాయి హైకోర్టు ఇచ్చిన వివాదస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నాగపూర్ బెంచి ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివాదస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు వెల్లడించారు. ముంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారి తీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేసు వివరాల్లోకి వెళితే.. 39 ఏళ్ల ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసివేసి ఆమె ఛాతి భాగాన్ని నొక్కుతూ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి చేష్ఠలను ముందే పసిగట్టిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ది చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం-2021 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కింది న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతనిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుష్పా ఈనెల 19న తుది తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దుస్తులపై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్ టు స్కిన్ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి అని జస్టిస్ పుష్ప తన తీర్పులో పేర్కొన్నారు.
చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి. కనుక అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్ధోషి అని తీర్పునిచ్చారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని జడ్జి పేర్కొన్నారు.
ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.