పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

By -  Medi Samrat
Published on : 2 Dec 2025 3:45 PM IST

పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే.. బీఎస్ యడ్యూరప్ప పిటిషన్‌పై సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశాన్ని తిరిగి హైకోర్టుకు పంపే అంశాన్ని పరిశీలించేందుకు ప్రాథమికంగా నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

యడ్యూరప్ప తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ.. హైకోర్టు కీలకమైన సాక్ష్యాలను పట్టించుకోలేదని, ఆ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఆరోపించిన సంఘటన సమయంలో.. ఇలాంటిదేమీ జరగలేదని ఇది చూపిస్తుంది. లూత్రా మాట్లాడుతూ.. 'ప్రాసిక్యూషన్ అణచివేసే కొన్ని ప్రకటనలు ఉన్నాయి. హైకోర్టు వాస్తవాలను విస్మరించింది. ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని కోర్టుకు తెలిపారు.

పోక్సో చట్టం కింద మహిళ ఫిర్యాదుపై 2024 మార్చి 14న మాజీ సీఎం యడ్యూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం మృతి చెందింది. సహాయం కోరేందుకు యడ్యూరప్ప ఇంటికి వెళ్లినప్పుడు ఆయ‌న‌ తన 17 ఏళ్ల కుమార్తెను వేధించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. ఆయ‌న‌ డబ్బులు చెల్లించి ఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోక్సో చట్టంలోని వివిధ నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

జూలై 4, 2024న, ట్రయల్ కోర్టు యడ్యూరప్పపైనే కాకుండా సాక్ష్యాధారాలను నాశనం చేసి, కేసును అణిచివేసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై మరో ముగ్గురిపై కూడా కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. దీని తర్వాత, కర్ణాటక హైకోర్టు ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. తదనంతరం, ఫిబ్రవరి 28న, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని యడ్యూరప్ప, ఇతరుల‌కు సమన్లు ​​జారీ చేసింది.

ఫిబ్రవరి 28 నాటి ఉత్తర్వులను, ఫిర్యాదును యడ్యూరప్ప హైకోర్టులో సవాలు చేశారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే, గత నెలలో ఈ కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది, దీంతో ఆయ‌న‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు

Next Story