కొత్త వ్యవసాయ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
Supreme Court slams Centre over farm protests. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీనిపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.
By Medi Samrat Published on 11 Jan 2021 1:38 PM GMT
కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య పలు విడతలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి.. ఆ చర్చలు కాస్తా విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ ఘటనలపై సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. రైతులతో జరుగున్న చర్చల్లో ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదని.. రైతు ఆందోళనల్లో పాల్గొన్న వారిలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపింది. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారని.. ఏదైనా తప్పు జరిగినప్పుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతా వ్యతిరేకత ఉందని... చట్టాలు ప్రయోజనకరమని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కనిపించడం లేదని రైతులకు మద్దతుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము చెప్పడం లేదని.. సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నామని, ఈ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు వ్యవసాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఈ చట్టాలను కొంత కాలం నిలిపివేయలేకపోతే.. తామే చేస్తామని అన్నారు.
అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపిస్తూ, చట్టాలను నిలిపివేయడం కుదరదని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా కానీ, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా కానీ ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు ఉండదని తెలిపారు.