అతడితో ఉండడమే ఆమె చేసిన తప్పు.. సుప్రీంకోర్టులో హీరోయిన్‌కు చుక్కెదురు

కొందరితో చేసే సావాసం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటిదే బాలీవుడ్ నటికి కూడా ఎదురైంది.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 7:37 PM IST

అతడితో ఉండడమే ఆమె చేసిన తప్పు.. సుప్రీంకోర్టులో హీరోయిన్‌కు చుక్కెదురు

కొందరితో చేసే సావాసం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటిదే బాలీవుడ్ నటికి కూడా ఎదురైంది. ఆర్థిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ నుంచి ఆమెకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలన్న జాక్వెలిన్ అభ్యర్థనను గతంలో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. జాక్వెలిన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సుకేష్ నుంచి బహుమతులు అందుకున్న మాట వాస్తవమే అయినా, అది దోపిడీ చేసిన డబ్బని ఆమెకు తెలియదని వాదించారు. ప్రధాన దోపిడీ కేసులో జాక్వెలిన్ కేవలం సాక్షి మాత్రమేనని, కాబట్టి పీఎంఎల్‌ఏ కింద నిందితురాలిగా చేర్చడం సరికాదన్నారు. అయితే, ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. స్నేహితుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణమే. కానీ, ఒకరు నేరస్థుడైతే, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదు దశలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వాదనలు వినిపించవచ్చని జాక్వెలిన్‌కు సూచించింది.

Next Story