నిమిషా ప్రియ కేసుపై విచారణను వాయిదా వేసిన 'సుప్రీం'
యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసుపై విచారణను ఆగస్టు 14వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat
యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసుపై విచారణను ఆగస్టు 14వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ సందర్భంగా నిమిషా ప్రియా విషయంలో అన్ని విధాలా సాయం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యెమెన్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిమిషాకు మరణశిక్ష పడింది. నిమిషాకు జూలై 16న మరణశిక్ష విధించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కేరళకు చెందిన ముస్లిం మత పెద్ద సహాయం కారణంగా, నిమిషా ప్రియ మరణశిక్షను ప్రస్తుతానికి వాయిదా వేశారు.
యెమెన్‌లో హత్యానేరం కింద మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్షను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టుకు సమాచారం అందింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ వెంకట్రామన్ ఈ కేసులో నర్సును కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ప్రియ క్షేమంగా తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ధర్మాసనం కూడా అంగీకరించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నిమిషా మొదట మరణించిన మహదీ కుటుంబ సభ్యుల నుండి క్షమాపణ పొందవలసి ఉంటుందని, ఆపై బ్లడ్ మనీ సమస్య వస్తుందని అన్నారు. ఉరిని వాయిదా వేసినట్లు పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం కేసు విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.
38 ఏళ్ల భారతీయ నర్సు నిమిషా ప్రియను అన్ని దౌత్య మార్గాల ద్వారా రక్షించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ డిమాండ్ చేసింది. అలాగే నిమిష ప్రియను కాపాడేందుకు యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి కమిటీ వేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. ఆమెకు 2020లో మరణశిక్ష విధించబడింది. ఆమె చివరి అప్పీల్ 2023లో తిరస్కరించబడింది. నిమిషా ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలులో ఖైదు చేయబడింది.