వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్

దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 11:54 AM IST

National News, Delhi, Supreme Court,  stray dogs

వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీ: దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రాల నుంచి అమలు నివేదికలు (compliance affidavits) అందలేదని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని పరిశీలిస్తూ — “ఏ రాష్ట్రం నుంచి అమలు అఫిడవిట్ రాలేదు. కేవలం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే సమర్పించాయి. మిగతా రాష్ట్రాలు ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలి” అని పేర్కొంది.

జస్టిస్ నాథ్ వ్యాఖ్యానిస్తూ, “వీధి కుక్కల దాడులు నిరంతరం జరుగుతున్నాయి. దేశ ప్రతిష్టకూ దెబ్బ తగులుతోంది. విదేశీ పత్రికలూ ఈ ఘటనలను ప్రస్తావిస్తున్నాయి” అన్నారు. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, “జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, అధికారులు స్వయంగా కోర్టుకు హాజరై వివరాలు ఇవ్వాలి” అని సూచించారు. అడ్వొకేట్ నకుల్ దేవన్ పేర్కొన్నట్లు రూ.25,000 వేల ఇంప్లీడ్మెంట్ ఫీజు కోసం బ్యాంక్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రీ స్వీకరించలేదని తెలిపారు. దీనిపై కోర్టు స్పష్టతనివ్వనున్నట్లు తెలిపింది.

సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి మాట్లాడుతూ..“మా సంస్థ దేశవ్యాప్తంగా 2 లక్షల కుక్కలను స్టెరిలైజ్ చేసి, 4 లక్షల కుక్కలకు చికిత్స అందించింది. మేము గుర్తింపు పొందిన హ్యూమన్ సొసైటీ సంస్థ. దీనివల్ల కోర్టుకు సరైన పరిష్కారం లభిస్తుంది” అని వివరించారు. కోర్టు దీనిని గమనించి బ్యాంక్ డ్రాఫ్ట్ సమర్పించాలని సూచించింది.

ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానిస్తూ — “మానవులపై జరిగే దాడుల సంగతి ఏమిటి? ప్రతీ నివాస సమితి (RWA) ఈ కేసులో పక్షమైతే కోట్లాది పక్షాలు వస్తాయి. కాబట్టి సహేతుకమైన సూచనలు ఇవ్వండి” అని అన్నారు. గౌరి మౌలేఖీ తరఫున సీనియర్ అడ్వొకేట్ కృష్ణన్ వేణుగోపాల్, “జాతీయ జంతు సంక్షేమ బోర్డు (AWB), కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో పక్షాలుగా ఉండాలి” అని అభ్యర్థించారు.

కోర్టు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేస్తూ, నవంబర్ 3న ఉదయం 10:30 గంటలకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ నాథ్ హెచ్చరిస్తూ, “హాజరుకాలేకపోతే వ్యయభారం విధిస్తాం లేదా కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులకు పత్రికలు, సోషల్ మీడియా కనిపించడం లేదా? సర్వీస్ జరగకపోయినా హాజరుకావాల్సిందే” అన్నారు. అతను చివరగా వ్యాఖ్యానిస్తూ, “అన్ని చీఫ్ సెక్రటరీలు హాజరుకాకపోతే, కోర్టును ఆడిటోరియంలో నిర్వహిస్తాం” అని హెచ్చరించారు.

Next Story