దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
By - Medi Samrat |
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని తీవ్రమైన సమస్యగా కోర్టు పేర్కొంది. దేశంలో దత్తత ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని, ఈ విధానాన్ని సరళీకృతం చేయాలని కేంద్రాన్ని కోరింది.
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మౌఖికంగా మాట్లాడుతూ.. 'దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు నేను వార్తాపత్రికలో చదివాను. ఇది నిజమో కాదో నాకు తెలియదు. అయితే ఇది తీవ్రమైన సమస్య. దత్తత ప్రక్రియ కఠినంగా ఉన్నందున.. దానిని ఉల్లంఘించడం సహజమేనని, పిల్లలను కనేందుకు ప్రజలు చట్టవిరుద్ధమైన పద్ధతులను అవలంబిస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. పిల్లలు తప్పిపోయిన కేసులను పరిశీలించడానికి నోడల్ అధికారిని నియమించడానికి ఆరు వారాల సమయం కోరారు. అయితే, సుప్రీంకోర్టు ఆరు వారాల సమయం ఇవ్వడానికి నిరాకరించింది. డిసెంబర్ 9 లోగా ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను కోరింది.
తప్పిపోయిన పిల్లల కేసులను పరిశీలించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోడల్ అధికారిని నియమించాలని అక్టోబర్ 14న బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్య పోర్టల్‌లో ప్రచురణ కోసం వారి పేర్లు, సంప్రదింపు వివరాలను అందించడానికి సూచనలను ఇవ్వండని సూచించింది. పోర్టల్‌లో తప్పిపోయిన చిన్నారికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు సమాచారం అందించాలని ధర్మాసనం ఆదేశించింది.
తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడానికి.. అలాంటి కేసులను విచారించడానికి హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని కోరింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో నిమగ్నమైన పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందని బెంచ్ నొక్కి చెప్పింది. పోర్టల్‌లో ప్రతి రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక అధికారి ఉండవచ్చని కోర్టు పేర్కొంది. వారు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మిస్సింగ్ ఫిర్యాదుల ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉంటారు. గురియా స్వయంసేవక్ సంస్థాన్ అనే NGO సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అపహరణకు గురైన లేదా తప్పిపోయిన పిల్లల అపరిష్కృత కేసులతో పాటు, భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న ఖోయా/పాయా పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను హైలైట్ చేసింది.