దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By - Knakam Karthik |
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియా బెంచ్ ఈ ఆదేశాలు వెలువరించింది. గత విచారణలో ప్రభుత్వ భవనాల పరిసరాల్లో కుక్కలకు ఆహారం పెట్టే వ్యవహారాన్ని నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు కోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఇదే విచారణలో పశువుల సంక్షేమ బోర్డు (AWBI)ను కేసులో ఇంప్లీడ్ చేయడంతో పాటు, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే..
అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్న విషయాలు కోర్టు ఆదేశాల్లో భాగంగా పరిగణించబడతాయి. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలి. నిర్లక్ష్యం జరిగితే తీవ్రంగా పరిగణిస్తాము,” అని బెంచ్ హెచ్చరించింది.
విచారణ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులకు జాతీయ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మీద కనిపించే నిరాశ్రయ జంతువులను (కుక్కలు, పశువులు మొదలైనవి) తొలగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం కోసం జాయింట్ కోఆర్డినేటెడ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. రహదారుల నుంచి తరలించిన పశువులు, కుక్కలకు అవసరమైన సంరక్షణాన్ని అందించాలి.
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఆదేశాల అమలుపై కచ్చితమైన బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబడుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 8 వారాల్లోగా అమలు విధానం, చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరాశ్రయ కుక్కల దాడులు, రహదారులపై పశువుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.