బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీపావళికి కొన్ని రోజుల ముందు ఎన్‌సిఆర్‌లో పటాకులు పేల్చడంపై పూర్తి నిషేధం ఆచరణాత్మకం కాదు లేదా ఆదర్శం కాదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

By -  Medi Samrat
Published on : 11 Oct 2025 6:30 PM IST

బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీపావళికి కొన్ని రోజుల ముందు ఎన్‌సిఆర్‌లో పటాకులు పేల్చడంపై పూర్తి నిషేధం ఆచరణాత్మకం కాదు లేదా ఆదర్శం కాదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. పరిమితులలో సడలింపు గురించి సూచించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇటువంటి పరిమితులు తరచుగా ఉల్లంఘించబడుతున్నాయని, అందువల్ల న్యాయమైన సమతుల్యత అవసరం అని పేర్కొంది. ఎన్‌సీఆర్‌లో గ్రీన్ పటాకుల తయారీ, అమ్మకాలకు అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం, ఎన్‌సీఆర్‌ రాష్ట్రాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ పూర్తి నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. దీపావళి, ఇతర పండుగలలో ఎటువంటి సమయ పరిమితి లేకుండా పిల్లలు క్రాకర్స్ పేల్చడానికి అనుమతించాలని అన్నారు.

ఎన్‌సిఆర్‌లో 2018 నుండి విధించిన పూర్తి నిషేధాన్ని ప్రశ్నిస్తూ.. నిషేధం ఫలితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ)లో ఏదైనా స్పష్టమైన మార్పు లేదా తగ్గింపు ఉందా అని అధికారులు, ఇతరుల న్యాయవాదులను బెంచ్ ప్రశ్నించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ డేటాను ఉటంకిస్తూ.. కోవిడ్ -19 లాక్‌డౌన్ వ్యవధిలో పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాలు బంద్ చేసిన్పుడు మినహా కాలుష్య స్థాయిలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని మెహతా చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. 'పూర్తి నిషేధం ఉన్నప్పటికీ పటాకుల వినియోగం కొనసాగుతోంది. చాలా కఠినమైన ఆదేశాలు సమస్యలను సృష్టిస్తాయి. పర్యావరణం, జీవనోపాధి రెండింటి ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య పరిష్కారం కోసం కోర్టు చూస్తోందని ఆయన అన్నారు. ఆర్డర్‌ను రిజర్వ్ చేయడానికి ముందు, బెంచ్ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఎన్‌సిఆర్ రాష్ట్రాలు, బాణసంచా తయారీదారులు, పర్యావరణవేత్తలు. అమికస్ క్యూరీ నుండి వివరణాత్మక వాదనలు విన్నది.

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండేలా, కార్మికుల జీవనోపాధి హక్కు, పండుగలు జరుపుకునే పౌరుల హక్కు రెండింటినీ పరిరక్షించే 'సమతుల్య విధానాన్ని' అనుసరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ఆమోదించిన గ్రీన్ క్రాకర్ల తయారీ, విక్రయాలను మాత్రమే కఠినమైన పర్యవేక్షణలో అనుమతించాలని మెహతా ప్రతిపాదించారు. "లైసెన్సు ఉన్న వ్యాపారుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలి. వారు అనుమతించబడిన పటాకులను మాత్రమే విక్రయిస్తున్నారని నిర్ధారించుకోవాలి" అని ఆయన సూచించారు. ఆన్‌లైన్‌లో పటాకులను విక్రయించడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను అనుమతించకూడదు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO), NEERI లు తయారీ యూనిట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తాయని, నిబంధనలను ఉల్లంఘించే ఏ యూనిట్ అయినా వెంటనే సీలు చేయబడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలోని మొత్తం 16 జిల్లాలు ఉండటం గమనార్హం.

Next Story