మహిళలంటే మాకు అపారగౌరవం ఉంది : సుప్రీం

Supreme Court has highest respect for womanhood. అత్యాచారానికి గురైన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా.. సర్వోన్నత న్యాయస్థానం

By Medi Samrat  Published on  8 March 2021 5:38 PM IST
Supreme Court has highest respect for womanhood

దిల్లీ: అత్యాచారానికి గురైన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా.. సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వేళ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే వాటిపై స్పష్టతనిచ్చారు. తమ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, మహిళలంటే తమకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. ''బాధితురాలిని పెళ్లి చేసుకోమని మేం అతడిని అడగలేదు. పెళ్లి చేసుకోబోతున్నావా అని ప్రశ్నించాం. అంతేగానీ, అతడికి ఎలాంటి ఆదేశాలివ్వలేదు'' అని సీజేఏ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది.

ఇటీవల ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ (23)పై అత్యాచారం కేసు నమోదయింది. 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అందింది. ఘటన జరిగే నాటికి ఆమె వయసు 16 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా.. ''మీరు ఆమెను పెళ్లాడుతారా? అలాగని పెళ్లి చేసుకోవాలని మేమేమీ ఒత్తిడి తేవడం లేదు'' అని పేర్కొంది. అయితే ఆయనకు ఇప్పటికే వేరే మహిళతో వివాహం జరిగిందని నిందితుని తరఫు న్యాయవాది తెలిపారు. తొలుత ఆ బాలికనే పెళ్లాడాలని అనుకున్నారని, కానీ అందుకు ఆమె తిరస్కరించడంతో వేరేవారిని చేసుకున్నారని చెప్పారు.

అయితే బాధితురాలిని పెళ్లి చేసుకోమని ధర్మాసనం అడగటంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ సీపీంఎ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌‌ ఇటీవల సీజేఐకు లేఖ రాశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా స్పష్టతనిచ్చింది.


Next Story