అమిత్ షాపై వ్యాఖ్యల కేసు.. సుప్రీంలో రాహుల్‌కు ఊరట
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.
By Medi Samrat Published on 20 Jan 2025 12:44 PM ISTకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా కేసు పెట్టారు. 2019 ఎన్నికల ర్యాలీలో చైబాసాలో తన బహిరంగ సభ ప్రసంగంలో.. రాహుల్ గాంధీ అమిత్ షాను విమర్శిస్తూ 'కిల్లర్' అనే పదాన్ని వాడారు.
జస్టిస్‌లు విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకుడు నవీన్ ఝాకు రాహుల్ విజ్ఞప్తిపై స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు ఫిర్యాదుదారు నవీన్ ఝా, జార్ఖండ్ ప్రభుత్వానికి కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాహుల్ గాంధీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నోటీసులలో పేర్కొంది. అంతకుముందు.. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాలు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది.