ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఆప్ నేత‌కు బెయిల్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సంజయ్ సింగ్ బెయిల్, అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది

By Medi Samrat  Published on  2 April 2024 9:45 AM GMT
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఆప్ నేత‌కు బెయిల్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సంజయ్ సింగ్ బెయిల్, అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచార‌ణ‌లో భాగంగా సంజయ్ సింగ్‌ను మరికొంత కాలం కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందా అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకు ఈడీ అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌డంతో కోర్టు సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

అంత‌కుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆప్ నేత సంజయ్‌సింగ్‌ను కస్టడీకి తీసుకోవాల్సి వస్తే భోజన విరామం తర్వాత తెలియజేయాలని ఈడీకి సుప్రీంకోర్టు సూచించింది. ఇది కాకుండా సంజయ్ సింగ్ ఆరు నెలలు జైలులో గడిపారని.. అతనిపై రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని.. అత‌ని ద‌గ్గ‌ర ఒక పైసా దొర‌క‌న‌ప్పుడు ఇన్నిరోజులు జైలులో ఎలా ఉంచార‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఈ ఆరోపణలపై విచారణ సమయంలో దర్యాప్తు చేయవచ్చు.

సంజయ్ సింగ్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కీలక సాక్షి దినేష్ అరోరా తన మునుపటి తొమ్మిది వాంగ్మూలాలలో సంజయ్ సింగ్ పేరును చెప్ప‌లేదని అన్నారు. వాంగ్మూలం ధృవీకరించబడకపోతే అది నమ్మదగినది కాదని సింఘ్వీ కోర్టులో పేర్కొన్నారు. సంజ‌య్ సింగ్ ఢిల్లీ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2023 అక్టోబర్ 4న ఆయ‌న‌ను అరెస్టు చేసింది.

Next Story