మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By - Knakam Karthik |
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ కేసులో ట్రయల్ కొనసాగడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం — యడ్యూరప్ప దాఖలు చేసిన హైకోర్టు తీర్పు రద్దు పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కేసును తిరిగి హైకోర్టుకు పంపేందుకు మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. “నోటీసులు జారీ చేయాలి. అంతవరకు ట్రయల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయబడతాయి” అని సుప్రీం కోర్టు పేర్కొంది.
యడ్యూరప్ప తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ..“ప్రాసిక్యూషన్ కొన్ని కీలక ప్రకటనలను దాచిపెట్టింది. హైకోర్టు ముఖ్యమైన వాస్తవాలను పట్టించుకోలేదు. అక్కడ ఉన్న పలువురు ‘ఏమీ జరగలేదు’ అని చెప్పినా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఆయన నాలుగుసార్లు సీఎం అయిన వ్యక్తి,” అని తెలిపారు. దానికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్ “హైకోర్టును మీరు ఎలా మినీ ట్రయల్ నిర్వహించమని బలవంతం చేస్తారు?” అని వ్యాఖ్యానించారు.
కేసు నేపథ్యం ఇదే
ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి యడ్యూరప్ప నివాసానికి సహాయం కోసం వెళ్లినప్పుడు, అక్కడ తన కుమార్తెను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 2024 మార్చి 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఇప్పుడు మరణించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా POCSO Act సెక్షన్ 8, IPC 354(A) (లైంగిక వేధింపులు) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి దర్యాప్తులో, సాక్ష్యాలను చెరిపివేయడం, డబ్బు ఇచ్చి కేసును ముట్టడించేందుకు ప్రయత్నించటం వంటి ఆరోపణలపై IPC 204, 214 r/w 37 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.
కోర్టుల మధ్య తిరుగుతున్న కేసు
జూలై 4, 2024: ట్రయల్ కోర్టు మొదటి సారిగా కానిజెన్స్ తీసుకుంది. హైకోర్టు: ఆ ఆదేశాన్ని “స్పష్టత లేకుండా ఇచ్చారు” అంటూ రద్దు చేసి, తిరిగి నిర్ణయించమని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. ఫిబ్రవరి 28, 2025న ట్రయల్ కోర్టు మళ్లీ కానిజెన్స్ తీసుకుని, మార్చి 15న హాజరు కావాలని యడ్యూరప్పకి నోటీసు పంపింది. యడ్యూరప్ప దీనిపై హైకోర్టు వెళ్లగా, హైకోర్టు ఉపశమనం ఇవ్వలేదు. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం కోర్టు ట్రయల్‌ను స్టే చేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ట్రయల్ ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసును మళ్లీ హైకోర్టులో పునర్విచారణ చేయించాలన్న సూచన తో కేసు మరొకసారి హైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.