కాఫీ ధర 700 రూపాయలా? ఇలాగైతే థియేటర్లు ఖాళీనే..సుప్రీం మండిపాటు
మల్టీప్లెక్స్‌లలోని అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేసింది.
By - Knakam Karthik |
కాఫీ ధర 700 రూపాయలా? ఇలాగైతే థియేటర్లు ఖాళీనే..సుప్రీం మండిపాటు
మల్టీప్లెక్స్‌లలోని అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేసింది. సినిమా టికెట్లు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాటర్ బాటిల్‌కు రూ.100, పాప్‌కార్న్‌కు రూ.500 వసూలు చేయడంపై మండిపడింది. ధరలు తగ్గించకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఈ వ్యాఖ్యలు చేసింది. టికెట్ల ధరలపై రూ.200 పరిమితిపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.
జస్టిస్ విక్రమ్‌నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా మల్టీప్లెక్స్‌లలో ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రజలు వినోదాన్ని అందుబాటులో ఆస్వాదించాలంటే ధరలు సరసంగా ఉండాలని, లేని పక్షంలో సినిమా రంగానికి పెద్ద నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.
ఒక కుటుంబం సినిమాకి వెళ్తే రూ.1500 నుంచి రూ.2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇది సామాన్యులకు భారంగా మారిందని కోర్టు అభిప్రాయపడింది. థియేటర్లలో విక్రయించే ఆహార, పానీయాల ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక్క వాటర్ బాటిల్‌కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సినిమా హాళ్లు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరిస్తూ, టికెట్ ధరలను రూ.200కి పరిమితం చేయాలని ప్రతిపాదించింది.